Dear Friends
Here is an interview of Yogeswara rao mamayya done by Journalist Aruna pappu of Andhra Jyothy.
Those who can read Telugu... enjoy...
విత్తన రంగంలో యాభయ్యేళ్లకు పైగా అనుభవమున్న యలమంచిలి యోగేశ్వర్రావును కదిలిస్తే పైరగాలి వీచినట్టు జ్ఞాపకాలు గుసగుసలాడతాయి. కాలినడకన హైస్కూలుకు వెళ్లడం మొదలుకొని రాజేంద్రనగర్‌లో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుదాకా ఎన్నో కబుర్లు దొర్లుతాయి. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎనిమిదేళ్ల పాటు అత్యున్నత స్థాయిలో పనిచేసిన యోగేశ్వర్రావు సీడ్స్‌మెన్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లోనూ సభ్యుడిగా పనిచేసి మన రాష్ట్రంలో వ్యవసాయరంగానికి ఎంతో సేవచేశారు. యోగేశ్వర్రావు జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే....
్‌్1931 డిసెంబర్ 28న కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలోని ముదునూరు గ్రామంలో పుట్టాను. ముందునుంచీ వ్యవసాయకుటుంబమే మాది. అప్పట్లో మా ఊళ్లో హైస్కూలు లేదు. అయితే ఇటు గాడంకి లేదంటే అటు వానపాముల వెళ్లి చదువుకోవాలి. దానికి రోజుకు ఎనిమిదిపది కిలోమీటర్ల నడక. అయితే ఈ అలసటతోనూ, ఇంట్లోని గారాబంతోనూ నేను సరిగా చదవడంలేదేమోనని మా నాన్నగారు నన్ను తీసుకెళ్లి భద్రాచలంలో హెల్త్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న మా బాబాయికి అప్పజెప్పారు. చక్కగా రోజూ గుడికెళ్లి శ్రీరాములవారిని దర్శించుకుని స్కూలుకెళ్లడం, బుద్ధిగా చదువుకోవడం... దాంతో నేను మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాను, మంచి మార్కులతో పాసయ్యాను కూడా. నేను బాగా చదువుకుని డాక్టరవాలని మా నాన్న కోరిక. దాంతో నేను విజయవాడలోని ఎస్‌ఆర్‌ఆర్‌సీవీ కాలేజీలో బైపీసీలో చేరాను. అక్కడ మాకు కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణగారు ్‌దుర్గేశనందిని* అనే పుస్తకాన్ని నాన్‌డీటెయిల్‌గా బోధించేవారు. అలాగే కేరళ నుంచి వచ్చిన ఒకాయన జువాలజీ లెక్చరర్‌గా పాఠాలు చెప్పేవారు. వీళ్లిద్దరి బోధనతో ప్రభావితమై నేను ఎప్పటికైనా లెక్చరర్ కావాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాను. ఇంటర్ తర్వాత బీఎస్సీ జువాలజీ కోసం గుంటూరు కాలేజీలో చేరి ఎంబీబీఎస్ సీటు వస్తుందేమోనన్న ఆశతో ఓ పాతికరోజుల పాటు కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాను. మెడిసిన్ సీటు రాలేదని తెలిసిన తర్వాత కాలేజీకి వెళితే అక్కడ నా పేరు కొట్టేశారని తెలిసింది. స్నేహితులతో చెబితే ్‌బాపట్లలో కూడా అప్లై చేశావుకదా, అక్కడ అడిగిచూడమ*న్నారు. అలా నేను బాపట్ల వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చర్ బీఎస్సీలో చేరాను. వ్యవసాయకుటుంబమే అయినా, వ్యవసాయ శాస్త్రాన్ని చదవడం నాకెందుకో బాగా నచ్చింది. నా మనసు ఆ చదువుమీదే లగ్నమయింది. 55లో పట్టభద్రుడవగానే జిల్లాల్లో స్పెషల్ డిమాన్‌స్ట్రేటర్‌గా ఉద్యోగానికి తీసుకున్నారు. అప్పుడే నేను విత్తనాలకు సంబంధించిన పరిశోధనల వైపు కావాలని అడిగి వేయించుకున్నాను. అలా బాపట్లలో ఐదేళ్ల పాటు జీడిమామిడిపై పరిశోధన చేశాను. ఒకవైపు ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ చేస్తూనే ఇక్కడ సీనియర్తో కలిసి ఫ్లోరల్ బయాలజీ లోతుపాతులు తెలుసుకునే పనిలో తలమునకలుగా ఉండేవాణ్ని. తోటలకు ఆనుకుని ఉండే రేకుషెడ్లే మాకు నివాసం. రాత్రిపూట పువ్వులు పుష్పించే సమయంలో మేం వాటి వాటి వివరాలను జాగ్రత్తగా రాసుకునేవాళ్లం. ఒక వాచ్‌మేన్ లాంతరు పట్టుకుని ముందు నడిస్తే మేం ఆయన వెనుక నడుస్తూ రికార్డులు రాసుకోవడం. అయితే ఆ అనుభవం తర్వాత ఎంతో ఉపయోగపడింది. ఫీల్డ్‌వర్క్ ప్రాముఖ్యత ఏమిటో విద్యార్థి దశలోనే గ్రహించాలి.
అవకాశం... అనుభవం
దీని తర్వాత తణుకులో అరటి రకాల మీద పరిశోధనలు చేశాను. ఈలోగా పళ్లజాతుల సాగుకు సంబంధించి కొన్ని పుస్తకాలూ రాశాను. దండకారణ్య డెవలప్‌మెంట్ బోర్డులో మంచి ఉద్యోగం వచ్చింది, ఇక వెళ్దాం అనుకునే సమయానికి మా పొరుగున ఉండే వెటర్నరీ వైద్యుడొకాయన ఉస్మానియా యూనివర్సిటీలో లెక్చరర్ ఉద్యోగాలున్నాయని చెబితే ఎగిరి గంతేసి దరఖాస్తు చేశాను. అక్కడ చేరడం వల్లనే క్రాప్ ఎకాలజీలో ఎమ్మెస్ చేయడానికి అమెరికాలోని కాన్సాస్ యూనివర్సిటీకి వెళ్లే అవకాశం వచ్చింది. అయితే దానివల్ల నేను యూనివర్సిటీలో పర్మనెంట్ ఫ్యాకల్టీగా పనిచేసే అవకాశాన్ని పోగొట్టుకున్నాను. 1964లో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటయింది. రాజేంద్రనగర్‌లో విశ్వవిద్యాలయ స్థాపన సమయంలో చేరడం, అన్ని పనులనూ ముందునుంచీ పర్యవేక్షించడం మంచి ఎక్స్‌పీరియెన్స్. అక్కడ రోడ్లకిరువైపులా వేసిన ఎవెన్యూ ట్రీస్ రెండు సార్లు చనిపోయాయని చెబితే వాటిని జాగ్రత్తగా సంరక్షించాం. ఇవాళ వెళ్లి చూస్తే అవి మహా వృక్షాలయి కనిపిస్తాయి. అలాగే ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి వస్తున్నారంటే రాత్రికిరాత్రి ఆ ప్రాంతమంతా బుల్డోజర్స్ తెప్పించి చదునుచేయించడాన్నీ మర్చిపోలేను. హాస్టళ్లు, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, విద్యార్థులు ప్రయోగాలు చేసే ల్యాబ్స్, ఫీల్డ్స్... ఎక్కడ సమస్య ఎదురైనా పరుగెత్తుకు వెళ్లాల్సిందే. మధ్యలో ఒకసారి నా సహోద్యోగులే విద్యార్థులతో పైవారికి ఫిర్యాదు చేయించారు. తర్వాత అది తప్పని తేలిందనుకోండి. అలా పదేళ్లు గడిచాక ఫీల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా పనిచేసే అవకాశం వచ్చింది. నల్గొండ జిల్లా గరిడిపల్లిలో ఏడొందలమంది రైతులకు చెందిన ఏడువేల ఎకరాల ఫీల్డ్ అది. అక్కడ పంటల బాగోగులు చూడటం చాలా గొప్ప అనుభవం. అక్కడా చేల పక్కన షెడ్లలోనే నా మకాం. అలాగే మార్టేరు రైస్ రీసెర్చ్ సెంటర్‌లో చేసిన ఒక ఏడాది, ఫోర్డ్ ఫౌండేషన్ తరపున ఏలూరు పరిసర ప్రాంతాల్లో భూసారాన్ని పెంచే ప్రాజెక్టు చెయ్యడం కూడా చాలా మంచి అనుభవాన్నిచ్చాయి.
అవార్డులూరివార్డులూ
ఫీల్డ్‌వర్క్‌కు ప్రతిఫలంగానా అన్నట్టు 82లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు ఎమ్‌డీగా బాధ్యతలు స్వీకరించాను. ఎనిమిదేళ్ల పాటు చేసిన ఆ ఉద్యోగం నాకు గొప్ప సంతృప్తినిచ్చింది. విత్తనాల ఉత్పత్తి, ప్రాసెసింగ్, క్వాలిటీ కంట్రోల్, మార్కెటింగ్ వీటన్నిటినీ చూసుకోవాలి అక్కడ. నేను పనిచేసిన కాలంలో ్‌నేషనల్ సీడ్ ప్రాజెక్ట్*లో భాగంగా మన రాష్ట్రంలో ఐదువేల టన్నుల సామర్థ్యం కలిగిన రెండు ప్రాసెసింగ్ ప్లాంట్లు నిర్మాణమవడం ఆనందంగా అనిపిస్తుంది. అప్పట్లోనే ఏడాదికి యాభైవేల టన్నుల విత్తనాలను ఉత్పత్తి చేయగలిగిన సామర్థ్యం మా కార్పొరేషన్‌కుండేది. అందువల్లేనేమో, నేను పనిచేసిన కాలంలో వరసగా మూడేళ్లు మన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ్‌నేషనల్ ప్రోడక్టివిటీ కౌన్సిల్ అవార్డు*ను సొంతం చేసుకుంది. ఈ పదవిలో వరసగా ఎనిమిదేళ్ల పాటు పనిచేసిన ఎండీని నేనే అనుకుంటా. ఈ సమయంలోనే రాష్ట్రంలోని స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్, ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్‌లకూ ఎండీగా అదనపు బాధ్యతలు నిర్వహించాను. ఆ సమయంలో ఒకరోజు మంత్రి వసంత నాగేశ్వర్రావుగారు వేరుశెనగ విత్తనాల పంపిణీ పరిస్థితిని సమీక్షిస్తూ సమావేశం నిర్వహించారు. నేనిచ్చిన గణాంకాలు ఆయనకు సంతృప్తిని కలిగించలేదు. *అవి మూడు రోజుల కిందటివి. ఇప్పుడు నేను చెబుతున్నది ఇవాళ్టి లెక్కలు* అని చెబుతున్నా వినకుండా *అయామ్‌నాట్ శాటిస్‌ఫైడ్ విత్ యువర్ పెర్ఫార్మెన్స్* అనేశారు. నేను చాలా బాధపడి వెళ్లిపోయాను. తర్వాత ఆయన వ్యక్తిగత సహాయకుడు ఫోన్ చేసి *బాధపడొద్దు సర్, ఆయనేదో టెన్షన్‌లో అలా అన్నారు తప్ప మీమీద సదభిప్రాయం లేకకాదు* అని చెప్పారు. అది నిజమే. తర్వాత మంత్రి కూడా కలిసినప్పుడు మామూలుగానే వ్యవహరించారు. ఢిల్లీవరకూ అందరికీ సదభిప్రాయం ఉండటంతో 90 ఏప్రిల్‌లో నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో జనరల్ మేనేజర్‌గా నియమించారు. ఈ సమయంలో నేను జనపనార, కూరగాయల విత్తనాల మీద ప్రత్యేకంగా దృష్టిపెట్టాను. మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల విత్తన అభివృద్ధి బోర్డుల్లో డైరెక్టర్‌గా కూడా వ్యవహరించాను.
పరిశోధనలు పెరగాలి
రిటైరయ్యాక కన్సల్టెంట్‌గా విత్తనాభివృద్ధి సంస్థలకూ, వివిధ ప్రభుత్వాలకూ కన్సల్టెంటుగా వ్యవహరించడం మొదలైంది. 99-2004 మధ్య కాలంలో ్‌ఆసియాలో హైబ్రిడ్ వరిని అభివృద్ధి చెయ్యడం* అన్న అంశంలో పనిచేస్తూ నేను నాలుగైదు దేశాలు తిరిగాను. శ్రీలంక, బంగ్లాదేశ్, ఇండొనేషియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో విస్తృతంగా పర్యటించాను. అప్పటికి ఉన్న విత్తన పరిశ్రమ పరిస్థితులను వివరిస్తూ, హైబ్రిడ్ వరి ద్వారా పెద్ద ఎత్తున దిగుబడి ఎలా సాధించవచ్చో చూపెట్టే మోడల్స్‌ను ప్రదర్శించాను. అలాగే హైబ్రిడ్ వరి విత్తనాల ఉత్పత్తిలోకి ప్రైవేటు రంగం అడుగుపెడుతున్నప్పుడు వారి భాగస్వామ్యం పెంచడానికి తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి కూడా వివరించాను. సీడ్ సర్టిఫికేషన్ ప్రమాణాల కోసం పనిచేశాను. 2007లో అమెరికాలోని న్యూఆర్లీన్స్‌లో జరిగిన బెల్ట్‌వైడ్ కాటన్ కాన్ఫరెన్స్‌లో మన దేశం తరఫున పాల్గొన్నాను. ఇంత అనుభవంతో చెప్పొచ్చేదేమంటే పెరుగుతున్న జనాభాకు తగిన ఆహారాన్ని అందించాలంటే మనం విత్తనాల విషయంలో బోలెడన్ని పరిశోధనలు చెయ్యాలి. ఈ విషయంలో చైనా వంటి దేశాలు మనకన్నా ముందున్నాయి. బీటీవంటి అంశాల్లో స్వచ్ఛంద సంస్థలు ఆందోళనలు లేవనెత్తుతూనే ఉంటాయి. అయితే వారి సందేహాలను నివృత్తి చేస్తూ మానవాళి ఆరోగ్యానికి హానిచేయని తరహా వంగడాలను అభివృద్ధి చేయాలి. దానికి ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యంతో పనిచేయడం అవసరం. అలాగే విత్తన రంగంలోకి రావాలనుకునే ప్రైవేటు సంస్థలూ ముందు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగాన్ని ప్రారంభించి, తర్వాతే విస్తరణ బాట పట్టాలి.**
యలమంచిలి యోగేశ్వర్రావుగారి సెల్ నెంబర్ : 9642311120
No comments:
Post a Comment